Image result for maha shivaratri greetings in telugu

మహా శివరాత్రి యొక్క విశిష్టత..!

హిందూ మతం పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉన్నది. మన ముఖ్యమైన పండుగల్లో మహా శివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం. ప్రతి నెలా కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి. ఆవేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహా శివరాత్రి మరింత ప్రత్యేకమైనది. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైనదిగా భావిస్తారు

శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఉదయానే లేచి తలస్నానం చేసి పూలూ ఫలాలతో శివునికి పూజ చేస్తారు. ఈరోజున ప్రతి దేవాలయమూ కిక్కిరిసి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి చెప్పనవసరమే లేదు. ఇసుక వేస్తే రాలనట్టు భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుని ఆరాధిస్తారు.

భక్తుల పాలిట కల్పతరువు అయిన శివునికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మారుమోగుతుంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం , శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి, భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కల్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో, చింతనలో గడిపి, రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం. భక్తులు ఈరోజున పరమేశ్వరుని ఆరాధించడమే కాకుండా ఏ తప్పులూ చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తారు. ఏడాది పొడుగునా ఏ పూజలూ చేయనివారు కూడా మహా శివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్ధించి శివ సన్నిధి పొందినట్లు పురాణాలలో ఎన్నో కధలు ఉన్నాయి. ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుంది అంటారు. గుణనిధి కధ ఇందుకు సాక్ష్యం. శివుని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక. అందుకే "భక్తవశంకర" అన్నారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలూ పట్టవు. దుర్గుణాలన్నీ అలవరచు కుంటాడు. అన్ని విధాలుగా పతనమైన అతను మహా శివరాత్రి నాడు కావాలని కాకున్నా, అన్నం దొరక్క ఉపవాసం ఉంటాడు. ప్రసాదం దొరుకుతుందనే ఆశతో దేవాలయానికి వెళ్తాడు. చీకటిలో కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు. జాగారంలో తూగుతున్న భక్తుల అలికిడికి భయపడి పారిపోబోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు. ఆవిధంగా ముక్తి పొందుతాడు. అదీ సంగతి. శివరాత్రి మహత్యం అంతటిది.

మహాశివరాత్రి రోజున ఉపవాసం, జాగారం ఎందుకు చేయాలో తెలుసా..?

హిందూధర్మం ప్రకారం ఎంతోమంది దేవుళ్ళు ,దేవతలు ఉన్నా..కేవలం వారి రూపాలనే కొలుస్తారు.కాని ఒక్క శివుడిని మాత్రమే లింగంగా పూజించడం విశిష్టత.క్షీరసాగర మధనం జరిపినప్పుడు ముందు హాలాహలం పుట్టింది.అయితే సృష్టిని రక్షించడానికి శివుడు ఆ గరళాన్ని తీసుకొని తన కంఠంలో ఉంచుకున్నాడు.అందుకే శివుడిని గరల కంటుడు అని కూడా పిలుస్తారు.సహధర్మచారిణికి తన శరీరంలో నుండి అర్ధభాగం ఇచ్చిన అర్ధనారీశ్వరుడు.తనను యముని భార్యనుండి రక్షించమని కోరిన భక్తమర్కండేయను చిరంజీవిగా జీవించమని వరాన్ని ఓసింగిన భక్తజన భాంధవుడు.అలాగే మన బోలాశంకరుడు అయిన ఈశ్వరుడు ఇచ్చిన వరాలను దుర్వినియోగం పరుచుకున్నారు.అంతటి విశిష్టత ఉన్న శివుని అనుగ్రహం పొందాలంటే..శివరాత్రి రోజున పూజ చేయడం ఉత్తమం.శివ అన్న పదానికి శుభప్రదం ,మంగళకరం అని అర్ధం.

కైలాషనాదుడైన ఆ పరమేశ్వరుడు మాహాశివరాత్రి నాడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రి గా పరిగణలోకి వచ్చింది.భోలాశంకరుడు,ఈశ్వరుడు,లింగోద్బోవం చెందిన పవిత్ర దినమే మహాశివరాత్రి.యావత్ సృష్టిని నడిపించే ఆ మహాశివుడే..మాఘమాసం బహులచతుర్ధషి రోజున అనంత భక్తకోటి కోసం శివలింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెప్పుతున్నాయి.ఆ రోజున జాగారణ నిర్వహించాల్సి ఉంటుంది.మహాశివరాత్రి పర్వదినాన లింగోద్బోవానికి సంబంధించిన ఒక పురాణ ఘదా ఒకటి ఆచరణలో ఉంది.

పూర్వం బ్రహ్మమరియు విష్ణువు లలో ఎవరు గొప్ప అనే వివాదం ఏర్పడింది.అయితే ఆ వివాదం ఎప్పటికి పరిష్కారం కాలేదు.అయితే ఆ సమయంలో ప్రలయకర్త అయిన శివుడు గొప్ప లింగంగా ఆవిర్భవించాడు.ఆ మహా శివలింగమే అది అంతాలను బ్రహ్మ విష్ణువులు కనిపెట్టలేకపోయారు.దీనితో వారికి కనువిప్పు కలిగింది.నాగాభుషనదారి పరమేశ్వరుడు లింగంగా ఆవిర్భవించిన రోజే శివరాత్రి గా చెప్పుతుంటారు.

శివరాత్రి రోజు ఉపవాసం ,జాగరణ ఉండటం సనాతన సాంప్రదాయం .శివరాత్రికి ముందు ఒక్కరోజు ఒక్కపూట మాత్రమే భోజనం చేయాలి.శివరాత్రి పర్వదినం రోజు ఉదయం స్థానాధులు పూర్తిచేసుకొని ,శివదర్శనం చేసుకొని శివనామ స్మరణతో ఉపావాసం ఉండాలి .రాత్రి వేళలో శివలింగానికి పూజలు చేస్తూ..జాగారణ చేయాల్సి ఉంటుంది.అయితే పూజా విధానం ,మంత్రాలు తెలియకపోయినప్పటికీ ఉపవాసం,జాగరణం,అభిషేకం లాంటి వాటితో పాల్గొంటే చాలు శివ అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్పుతున్నారు.ఇలా చేస్తే అనుకున్నా కార్యాలు సిద్దిస్తాయి.సకల సంపదలు చేకురుతాయి అని వారు సూచిస్తున్నారు.

శివరాత్రి ప్రాశస్త్యం

సకల చరాచర జగత్తుకు లయకారకుడు ఆ పరమేశ్వరుడు. భక్తుల పాలిట పెన్నిధి, భోళా శంకరుడైన ఈశ్వరుడు లింగోద్భవం చెందిన పవిత్ర దినమే మహాశివరాత్రి. యావత్‌ సృష్టిని నడిపించే ఆ శంభుడే మాఘ మాసం బహుళ చతుర్ధశి రోజు అనంత భక్త కోటి కోసం శివలింగంగా ఆవిర్భవించిన దినం కావడంతో మహాశివరాత్రిగా పరిగణిస్తారు.

‘శివ’ అన్న పదానికి మంగళకరం.. శుభప్రదం అని అర్ధం. కైలాసనాథుడైన ఆ పరమేశ్వరుడు మహాశివరాత్రి నాడు లింగంగా ఆవిర్భవించిన దినాన ఉపవాసం.. జాగరణ నిర్వహించాల్సి వుంటుంది.

లింగోద్భవం

మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవానికి సంబంధించిన ఒక పురాణగాథను తెలుసుకుందాం. పూర్వం బ్రహ్మ, విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం ఏర్పడింది. అయితే ఈ వివాదం ఎప్పటికీ పరిష్కారం కాలేదు. ఈ సమయంలో ప్రళయకర్తయైన శివుడు గొప్ప జ్యోతిర్లింగంగా ఆవిర్భవించారు. ఆ మహా శివలింగానికి ఆది, అంతాలను బ్రహ్మ, విష్ణువులు కనిపెట్టలేకపోయారు. దీంతో వారికి కనువిప్పు కలిగింది. నాగభూషణధారి పరమేశ్వరుడు లింగంగా ఆవిర్భవించిన దినాన్నే శివరాత్రిగా పండితులు పేర్కొంటారు.

ప్రళయ కాళరాత్రి తరువాత జగన్మాత కోరిక మేరకు శివుడు మళ్లీ జీవకోటిని ఉద్భవింపచేసినట్టు పురాణాలు వెల్లడిస్తున్నాయి. శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఉండటం సనాతన సంప్రదాయం. శివరాత్రికి ముందు ఒక్క రోజు ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. శివరాత్రి పర్వదినం నాడు ఉదయం స్నానాదులు పూర్తి చేసుకొని శివదర్శనం చేసుకొని శివనామస్మరణతో ఉపవాసం వుండాలి. రాత్రివేళలో శివలింగానికి పూజలు చేస్తూ జాగరణ చేయాల్సి వుంటుంది. పూజా విధానం, మంత్రాలు తెలియకపోయినప్పటికీ ఉపవాసం, జాగరణం, బిల్వార్చన, అభిషేకంలాంటి వాటిలో పాల్గొంటే చాలు శివానుగ్రహం లభిస్తుంది. ప్రపంచంలో అన్ని దేవతామూర్తులను వారి రూపాల్లోనే కొలుస్తాం. అయితే చంద్రశేఖరుడిని మాత్రం లింగంగా పూజించడం ఒక విశిష్టత. నిండు మనస్సుతో, భక్తితో పిలిస్తే చాలు ఆ లింగమూర్తి మనకు ప్రత్యక్షమవుతాడు. సమస్త జగత్తును దహించివేసేందుకు సిద్ధమైన హాలాహలాన్ని గొంతుకలో దాచుకున్న నీలకంఠుడు. సహధర్మచారిణికి తన శరీరంలో అర్ధ‌భాగమిచ్చిన అర్ధ‌నారీశ్వరుడు. తనను యముని బారినుంచి రక్షించమని కోరిన భక్త మార్కండేయను చిరంజీవిగా జీవించమని వరాన్ని ఒసంగిన భక్తజన బాంధవుడు.

శివోహం

పరమ జిజ్ఞాసువు, కారణజన్ముడైన ఒక విద్యార్థిని ఒక ఆధ్యాత్మిక గురూత్తముడు ‘నీ వెవరివి?’ అని ప్రశ్నించాడు ఆ విద్యార్థి సవినయంగా నమస్కరించి ‘చిదానందరూపః శివోహం శివోహం’ అని సమాధానం చెప్పాడు. ఇక్కడ శివుడు అన్న పదానికి పరబ్రహ్మం అనే అర్థం. మనం పరమేశ్వరుడు, శివుడు అని అర్థం చెప్పుకొంటే సందర్భోచితంగా ఉంటుంది. ఏ వ్యక్తి అయినా ‘నేను శివుడిని, నేనే శివుడిని’ అని మనసులో అనుకున్నా, పైకి అన్నా బాగానే ఉంటుంది. శివతత్వాన్ని అర్థం చేసుకుని శివుడిలాగా ప్రవర్తిస్తే ఇంకా బాగుంటుంది.

శివం అంటే శుభం అని అర్థం. శివుడు అంటే శుభాన్ని కలిగించేవాడు. శం అంటే సుఖం. శంకరుడు అంటే సుఖాన్ని కలిగించేవాడు. పాలసముద్రం నుంచి హాలాహలం ఆవిర్భవించినప్పుడు లోకాలన్నీ భయకంపితాలై హాహాకారాలు చేస్తుంటే శివుడు ఆ ఘోర విషాన్ని అరచేతిలోకి తీసుకొని ఆనందంగా తాగాడు. తనకు వెలుపల ఉన్న లోకాలకు, తనకు లోపల ఉన్న లోకాలకు ఇబ్బంది కలగకుండా దాన్ని తన కంఠ ప్రదేశంలో నిలుపుకొన్నాడు. ఇతరుల ఇబ్బందిని తొలగించడం మన పని అయినట్లయితే, మనం ఆ పనిని చేసి తీరవలసిందే. వారికి వచ్చిన ఇబ్బందిని తీర్చవలసిందే. ఇదీ శివతత్వం!

శివుడు అభిషేక ప్రియుడు. భక్తిప్రపత్తులతో ఒక్క ఉద్ధరిణెడు నీళ్లు తీసుకొని ‘హరహర మహాదేవ!’ అంటూ శివలింగం మీద పోస్తే చాలు. ఒక్క మారేడు దళాన్ని తీసుకొని ‘ఓం నమశ్శివాయ!’ అంటూ శివలింగం మీద ఉంచితే చాలు- శివుడు పొంగిపోతాడు. అతగాడి కోరికలనన్నింటినీ తీరుస్తాడు. మనవద్దకు వచ్చిన వ్యక్తి ఎంత విలువైన వస్తువును తెచ్చాడనేది కాదు, ఎంత ఆప్యాయతతో తెచ్చాడనేది ప్రధానం. మనం చూడవలసింది అర్థాన్ని కాదు, ఆత్మీయతనే. ఇదీ శివతత్వం!

శివుడు రుద్రుడు. అపరిమితమైన ఆగ్రహం కలవాడు. అదే శివుడు పరమ శాంతమూర్తి కూడా! శివుడి ఫాలనేత్రంలో భయంకరమైన అగ్ని ఉన్నది. తలమీద చల్లని వెన్నెలను కురిపించే చంద్రుడున్నాడు. మన్మథుడు తన మీద బాణంవేసిన సమయంలో శివుడు కాలాగ్నిరుద్రుడయ్యాడు. తన మూడో కంటిమంటతో అతణ్ని భస్మీపటలం చేశాడు. మన్మథుడి భార్య రతి దీనంగా ప్రార్థించగానే చల్లబడ్డాడు. ఆమెకు పతిభిక్ష పెట్టాడు. కోపమనేది మనిషికి చాలా సహజమైన లక్షణం. దీర్ఘక్రోధం పనికిరాదు. ఇరుగు పొరుగుకు నష్టాన్ని కలిగించే క్రోధం అసలు పనికిరాదు. పశ్చాత్తాపం చెందినవారిని క్షమించే గుణం ఉండాలి. ఇదీ శివతత్వం!

ఎక్కడో గగనతలంలో ఉన్న గంగానదీ ప్రవాహం ఒక్క వూపున భూమి మీదకు దూకితే చిన్న మట్టిముద్దలాంటి భూగోళం మొత్తం తడిసి బద్దలైపోవటం ఖాయం. అటువంటి సంకట పరిస్థితిలో భగీరథుడు ‘త్వమేవ శరణం మమ’ అంటూ ప్రార్థిస్తే శివుడు తన రెండు చేతులనూ నడుంమీద మోపి, రెండు పాదాలనూ కైలాస పర్వతశిల మీద స్థిరంగా వూని గంభీరంగా నిలబడ్డాడు. ఆకాశం నుంచి ఒక్క వూపున దూకిన గంగను తన శిరస్సు మీద భరించాడు. జటాజూటంలో బంధించాడు. ఒక్క పాయను వదిలి గంగను నిదానంగా హిమవత్పర్వతం మీదకు పంపాడు. మన సమక్షంలో ఏదైనా మహాప్రమాదం జరగబోతూ ఉంటే దాన్ని ఆపగలిగిన సామర్థ్యం మనకుంటే మనం ఆపవలసిందే. ఇదీ శివతత్వం!

శివుడు విభూతిరాయుడు. విభూతి అంటే ఐశ్వర్యం. అన్ని విధాలైన ఐశ్వర్యాలకూ ఆయన అధిపతి. సమస్త సంపదలకూ అధీశ్వరుడైన కుబేరుడు అతడికి ప్రియమిత్రుడు. అయినప్పటికీ శివుడు నిరాడంబరుడే! మన ఘనత అనేది మన వ్యక్తిత్వంలో ఉండాలి. మన ప్రవర్తనలో ఉండాలి. మన కర్తవ్య నిర్వహణలో ఉండాలి. అంతేకానీ, బాహ్యవేషంలో కానేకాదనటానికి శివుడే ఉదాహరణం; ఆదర్శం. ఇదీ శివతత్వం!

మహాన్యాసం అనే శివాభిషేకంలో దశాంగరౌద్రీకరణం అని ఉంది. అదేవిధంగా షోడశాంగరౌద్రీకరణం కూడా ఉంది. ఇవి మన శరీరంలోని లలాటం, నేత్రం మొదలైన పది అవయవాల్లోనూ, శిఖ, శిరస్సు మొదలైన పదహారు అవయవాల్లోనూ శివుడున్నాడని తెలియజేస్తున్నాయి. అంటే, మన శరీరం యావత్తూ శివస్వరూపమేనన్నమాట. మన శరీరం ఇంత పవిత్రమైనదీ, విలువైనదీ కనుక దీన్ని మనం సత్కార్యాల కోసమే వినియోగించాలని దీని అంతరార్థం. శివోహం- నేను శివుడిని; నేనే శివుడిని అనే మాటకు అసలైన అర్థమిదే!

మహాశివరాత్రి రోజు జపించాల్సిన మంత్రాలూ.....!

'ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్'' అనే మహామృత్యుంజయ మంత్రాన్ని మహాశివరాత్రి రోజున పఠిస్తే అనుకున్న కార్యాలు విజయంవంతంగా పూర్తవుతాయి. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పునర్జన్మంటూ వుండదు. మహాశివరాత్రి రోజున ''ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి.. తన్నో రుద్ర: ప్రచోదయాత్'' అనే శివ గాయత్రి నామంతో శివునిని పూజించే వారికి సకలసంపదలు చేకూరుతాయి.

ఈ మంత్ర జపంతో శివుని అనుగ్రహం పొందవచ్చు. ఈ రెండు మంత్రాలను శివరాత్రి రోజున 108 సార్లు జపించినట్లైతే దీర్ఘాయువు, ఆరోగ్యం చేకూరుతుంది. ప్రశాంతత, ఆనందం చేకూరుతుంది. భయం తొలగిపోతుంది. శరీరానికి బలం చేకూరుతుంది. ఏకాగ్రతను పెంచుతుంది. మహాశివరాత్రి రోజునే కాకుండా ఓ రోజైనా పగలు లేదా రాత్రి పూట ఈ మంత్ర జపంతో పరమేశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు.

ఒత్తిడి, విచారం, అనారోగ్యం, ఆకస్మిక మరణ భయం తొలగిపోతుంది. శివరాత్రి రోజున జాగారం చేయడం.. ఆలయాల్లో జరిగే పూజలో పాల్గొనడం ద్వారా ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఈతిబాధలు తొలగిపోతాయి. మహాశివరాత్రి రోజున నదీ స్నానం చేయడం ద్వారా పుణ్యఫలితం దక్కుతుంది. ఉపవాసం వున్నవారు రోజంతా పండ్లు, పాలు తీసుకుని, ఒంటి పూజ భోజనం చేయవచ్చు. సమీపంలోని శివాలయాలకు వెళ్లి పరమేశ్వరుడిని దర్శించుకోవడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

శివునిని అభిషేకించడం వల్ల కలిగే ఫలితాలు..

శివునిని భక్తిశ్రద్ధులతో ప్రతిఒక్కరు ఎంతో ఆరాధంగా పూజిస్తారు. ఆయనను అభిషేకించడానికి రకరకాల పదార్థాలను, ద్రవపదార్థాలను ఉపయోగిస్తారు. పూర్వం నుంచి మన హిందూ సంప్రదాయంలో కొనసాగుతున్న ఈ ఆచారాన్ని పాటించడం వల్ల పూర్వపాపాలు అన్ని తొలగిపోయి, మంచి లాభాలను పొందుతారని పండితులు, జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు.

అంతేకాదు ఏయే పదార్థాలతో శివునికి అభిషేకం చేస్తే ఆయా పదార్థాలకు సంబంధించిన మంచి ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. అవేమిటో ఒకసారి మనం కూడా తెలుసుకుందాం.

నువ్వుల నూనెతో శివుడిని అభిషేకిస్తే అపమృత్యువు నశిస్తుంది.

ఆవుపాలతో శివునిని అభిషేకం చేయడం వల్ల కష్టాలు తొలగిపోయి, సర్వసౌఖ్యాలు ప్రసాదించబడుతాయి.

గరిక నీటితో శివునికి అభిషేకం చేయడం వల్ల నష్టమైన ద్రవ్యం తిరిగి పొందుతారు.

మెత్తని చెక్కరతో శివునికి అభిషేకం చేయడం వల్ల జీవితంలో వున్న దు:ఖాలు నాశనం అయి, సంతోష జీవన విధానాన్ని పొందుతారు.

చెరకు రసంతో శివునికి అభిషేకించడం వల్ల ధనవ్యవహారాలలో వున్న సమస్యలు ఒక్కసారిగి తొలగిపోయి... ధనవృద్ది కలుగుతుంది.

ఆవు నేయితో శివునిని అభిషేకిస్తే నష్టాలన్నీ తొలగిపోయి, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.

నిత్యం పెరుగుతో శివునిని అభిషేకిస్తే మంచి ఆరోగ్యంతోపాటు బలం, యశస్సు లభిస్తుందని శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు.

మహాశివరాత్రి మహేశ్వరుని మెప్పించే ఆచరణ..!

ఫిబ్రవరి 13న మహాశివరాత్రి పర్వదినం వస్తోంది.ఈ రోజున ఉపవాసం,జాగరణ చేయడం ఉత్తమం.మహాశివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసి పువ్వులు,ఫలాలతో శివునికి పూజ చేయాలి.అభిషేకాలు చేయించాలి.రాత్రి పూట దేవాలయాల్లో జరిగే పూజల్లో పాల్గొనాలి.అసత్యాలు పలకడం,ఇతరులను దూషించడం చేయకూడదు.తప్పులు చేయకూడదు.చలికాలానికి స్వస్తి చెప్తూ మహాశివరాత్రి పర్వదినం వస్తుంది.

శివరాత్రి పూట జాగరణ చేస్తే తెలిసీ,తెలియక చేసిన తప్పుల పాపాలు తొలగిపోతాయి.శివసాయుజ్యం కైలాస ప్రాప్తి తథ్యమని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.శివరాత్రి నాటి జాగరణ ద్వారా పునర్జన్మంటూ వుండదని స్కాంద పురాణం చెప్తోంది.జాగారం చేసే సమయంలో భగవన్నామ స్మరణం చేస్తే సమస్త పాపాలు హరిస్తాయని విశ్వాసం.

శివరాత్రి నాడు చేసే జాగారాన్ని వ్యర్థ ప్రసంగాలతో కాకుండా శివనామస్మరణతో పూర్తి చేయాలి.జాగారం చేసే వారు శివ అష్టోత్తరము,శివ పంచాక్షరీ స్తోత్రం,దారిద్ర్యదహన స్తోత్రం,శివసహస్రనామము,శివారాధన,శివపురాణములతో లేదా పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు మహేశ్వరుడిని పూజించడం మంచిది.

ఇంకా ఆలయాల్లో ఏకాదశరుద్రాభిషేకం,108 బిందెలతో రుద్రాభిషేకం,శివ కళ్యాణం చేయిస్తే వంశాభివృద్ధి,సంతానప్రాప్తి చేకూరుతుంది.వివాహాల్లో అడ్డంకులు తొలగిపోతాయి.అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని పండితులు సూచిస్తున్నారు.

శ్రీ రుద్రదేవతా రూపం - శ్రీ రుద్ర పంచముఖ ధ్యాన శ్లోకాలు,

తాత్పర్యము

 

Dhyana Slokams for different Gods: Sri Rudra Pancha Mukha Dhyana Slokas and meaning in telugu

 

రుద్రాభిషేకంలో పంచముఖ ధ్యానంలోని శ్లోకాలు న్యాసంలో ప్రస్తావించబడ్డాయి. తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశానముఖ రూపాలలో ఉండే పరమేశ్వరుని ఐదు ధ్యాన శ్లోకాల రూపంలో బోధాయనులు రచించారు. ఈ మహాన్యాస వివేచనము రావణ ప్రోక్త న్యాస ప్రక్రియలోనిది. ఆ శ్లోకాలు, తాత్పర్యము క్రింద. దీనినే శివ పంచానన స్తోత్రం అని కూడా అంటారు. 

తత్పురుష ముఖ ధ్యానమ్
సంవర్తాగ్ని తటిప్రదీప్త కనక - ప్రస్పర్ధితేజోమయం
గంభీర ధ్వని మిశ్రితోగ్ర దహన - ప్రోద్భాసితామ్రాధరం
అర్ధేందుద్యుతిలోలపింగలజటా  - భారప్రబద్ధోరగం
వందే సిద్ధ సురాసురేంద్రనమితం - పూర్వం ముఖం శూలినః


తాత్పర్యము: ప్రళయ కాలము నందలి అగ్ని తేజము తోనూ, మెరపుల తేజముతోను, బాగా కరిగిన బంగారు కాంతితోను పోటీ పదే తేజములే తన రూపముగా కలది, గంభీరధ్వనితో మిశ్రితము అగుతతో పాటు భయంకరమైన అగ్ని వలె ప్రకాశించు ఎర్రని పెదవి కలదియు, చంద్ర ఖండ కాంతితో చక చక మెరయు పింగళ వర్ణపు జడల గుంపును, దాని చుట్టూ గట్టిగా చుట్టిన సర్పములు కలదియు, సిద్ధులు, సురాసురుల చేత నమస్కరించబడుతున్న, శూలికి సంబంధించిన తూర్పున ఉన్న ముఖమును నమస్కరించుచున్నాను. (రజో గుణ ప్రధానమైన సృష్టి తత్వమును ఈ శ్లోకములో స్తుతి చేయబడినది)

 

Dhyana Slokams for different Gods: Sri Rudra Pancha Mukha Dhyana Slokas and meaning in telugu

 

అఘోర ముఖ ధ్యానమ్
కాలాభ్రభ్రమరాంజనద్యుతినిభం - వ్యావృత్తపింగేక్షణం
కర్ణోద్భాసితభోగిమస్తకమణి - ప్రోద్భిన్న దంష్ట్రాంకురం
సర్పప్రోత కపాలశుక్తి శకల - వ్యాకీర్ణ సంచారగం
వందే దక్షిణమీశ్వరస్య కుటిల - భ్రూభంగ రౌద్రం ముఖం


తాత్పర్యము: నల్లని మేఘములు, తుమ్మెదల కాటుక - వీటి కాంతిని పోలిన కాంతితో ప్రకాశించునదియు, మిక్కిలి మిట్టగా తిరుగుచుండు పింగా వర్ణపు కన్నులు కలదియు, చెవుల యందు మిక్కిలి ప్రకాశించుచుండు సర్ప శిరోరత్నములతో బాగా కలిసిపోవుచున్న కోరల మొలకలు కలదియు, సర్పములతో పాటు (హారముగా) కూర్చబడిన కపాలములతో, ముత్యపు చిప్పల ముక్కలతోను, ఎగుడు దిగుదగుచున్న నడకను పొందినదియు, వంకరలుగా నున్న కను బొమ్మల ముడులతో భయంకరముగా నున్న ఈశ్వరుని దక్షిణ ముఖమును నమస్కరించు చున్నాను. (తమో గుణ ప్రధాన లయ కర్త తత్వము ఇక్కడ స్తుతి చేయబడింది)

 

Dhyana Slokams for different Gods: Sri Rudra Pancha Mukha Dhyana Slokas and meaning in telugu

 

సద్యోజాత ముఖ ధ్యానమ్
ప్రాలేయాచల చంద్రకుంద ధవళం - గోక్షీరఫేన ప్రభం
భస్మాభ్యక్తమనంగదేహ దహన - జ్వాలావళీలోచనం
బ్రహ్మేంద్రాది మరుద్గణైః స్తుతి పరై - రభ్యర్చితం యోగిభిః
వందేహం సకలం కళంకరహితం - స్థాణోర్ముఖం పశ్చిమం


తాత్పర్యము:  హిమవత్పర్వతము, చంద్రుడు, మొల్ల పూవు - వీని వలె తెల్లనిదియు, ఆవుపాల మీద నురుగు వలె తెల్లని కాంతి కలదియు, విభూతి పూయబదినదియు, మన్మథుని శరీరమును దహించు జ్వాలల పంక్తితో నిండిన కన్ను కలదియు, స్తోత్రము చేయుచున్న బ్రహ్మేన్ద్రాది దేవ సమూహముల చేతను, యోగుల చేతను శ్రద్ధతో అర్చించ బడుచున్నదియు, నిర్మలమైన నిండు వాదనముతో కనబడుచున్నదియును అగు శివుని పశ్చిమ నమస్కరించు చున్నాను. (సత్వ గుణ ప్రధాన రక్షణ కర్త తత్వమును ఈ శ్లోకములో స్తుతించ బడినది)

 

Dhyana Slokams for different Gods: Sri Rudra Pancha Mukha Dhyana Slokas and meaning in telugu

 

వామదేవ ముఖ ధ్యానమ్
గౌరం కుంకుమ పంకిలం సుతిలకం - వ్యాపాండు గండ స్థలం
భ్రూ విక్షేప కటాక్ష వీక్షణలసత్ - సంసక్త కర్ణోత్పలం
స్నిగ్ధం బింబ ఫలాధర ప్రహసితం - నీలాల కాలం కృతం
వందే పూర్ణ శశాంకమండల నిభం - వక్త్రం హరస్యోత్తరం


తాత్పర్యము:  గౌర (ఎరుపుతో కలిపిన తెలుపు) వర్ణము కలదియు, కుంకుమ పూ పూతతో నిన్దినదియు, అందమగు తిలకము కలదియు, విశేషముగా తెల్లదనము కళ చెక్కిళ్ళు కలదియు, కనుబొమ్మల కదలికతో ఒప్పుచుండు కడగంటి చూపుతో ప్రకాశించుటతో పాటు, చెవికి అలంకారముగా నున్న తెల్ల కలువ పూవు కలదియు, నున్నని దొండపండు పోలు ఎర్రని క్రింద పెదవిపై స్పష్టమగు నవ్వు కలదియు, నల్లని మున్గుతులచే అలంకరించబడిన, నిండు చంద్రుని మండలమును పోలుచు ప్రకాశించునదియు అగు శివుని ఉత్తరాముఖమును నమస్కరించు చున్నాను. (గుణ త్రయ మిశ్రమమగు ఈశ్వర తత్త్వము ఇక్కడ స్తుతించ బడినది)

 

Dhyana Slokams for different Gods: Sri Rudra Pancha Mukha Dhyana Slokas and meaning in telugu

 

ఈశాన ముఖ ధ్యానమ్
వ్యక్తావ్యక్త గుణేతరం సువిమలం - శట్త్రింశతత్వాత్మకం
తస్మాదుత్తర తత్త్వమక్షరమితి - ధ్యేయం సదా యోగిభిః
వందే తామస వర్జితం త్రినయనం - సూక్ష్మాతి సూక్ష్మాత్పరం
శాంతం పంచమమీశ్వరస్య వదనం - ఖవ్యాపి తేజోమయం


తాత్పర్యము: వ్యక్తము, అవ్యక్తము (స్పష్ట రూపము కలది, స్పష్ట రూపము లేనిది) అణు రెండు రెండు లక్షణముల కంటెను ఇతరమగు లక్షణము కలదియు, ముప్ఫై ఆరు తత్వముల రూపమున పరిణమించు నదియు,  సకల తత్వముల కంటెను ఉన్నతమైనదియు అగు అనుత్తరము అను అక్షర (అకార) తత్వమును ఎల్లప్పుడును యోగులచే ధ్యానించబడ దగినదియు,  తమో గుణ రహితంను, మూడు కన్నులు కలదియు, సూక్ష్మాతిసూక్ష్మమగు దాని కంటే గోప్పదియు, శాస్తమును, ఆకాశము నందంటను వ్యాపించు తేజమే తన రూపముగా కలదియు అగు ఈశ్వరుని ముఖమును నమస్కరింతును (గుణాతీత బ్రహ్మ తత్వమును ఇక్కడ స్తుతించబడినది)

 

Dhyana Slokams for different Gods: Sri Rudra Pancha Mukha Dhyana Slokas and meaning in telugu

 

శ్రీరుద్రధ్యానమ్
బ్రహ్మాండ వ్యాప్త దేహ భసితహిమరుచో - భాసమానా భుజంగైః
కంఠేకాలాః కపర్దాకలిత శశికలా - శ్చండకోదండ హస్తాః
త్ర్యక్షా రుద్రాక్ష భూషాః ప్రణత భయహరాః - శాంభవా మూర్తిభేదాః
రుద్రాః శ్రీ రుద్రసూక్తప్రకటిత విభవా - నః ప్రయచ్ఛంతు సౌఖ్యం


తాత్పర్యము: బ్రహ్మాండము నందంతటను వ్యాపించిన దేహము కలవారును, భస్మము చేత మంచుకాంతి వంటి దేహకాంతి కలవారును, సర్పములతో ప్రకాశించువారును, తమ కంఠములందు నలుపు వన్నె కలవారును, జటా ఝూటము నందు చంద్ర కళలు కలవారును, భయము గొలుపు ధనుస్సులు తమ హస్తములందు కలవారును, మూడు కన్నులు కలవారును, రుద్రాక్షలు తమ అలంకారములుగా కలవారును, తమ విషయమున ప్రణమిల్లిన వారి భయమును పోగొట్టువారును, పూజ్యమగు రుద్రసూక్త మంత్రములచే ప్రకాశింప జేయబడిన వైభవము కలవారును అగుచు శంభుని మూర్తి భేదములే అగు రుద్రులు మాకు సౌఖ్యమును కలిగింతురు గాక!

 

Dhyana Slokams for different Gods: Sri Rudra Pancha Mukha Dhyana Slokas and meaning in telugu

 

ప్రకారాంతరేణ శ్రీరుద్రధ్యానమ్
శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం దశభుజగ్‍ం సర్వాభరణ భూషితం నీలగ్రీవగ్‍ం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మోత్తరీయకం కమండల్వక్షసూత్రధర మభయవరదకరగ్‍ం శూలహస్తం జ్వలంతం కపిలజటినగ్‍ం శిఖా ముద్ద్యోతధారిణం వృషస్కంధసమారూఢ ముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యంచ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షర మవ్యయం సర్వ్యవ్యాపిన మీశానం రుద్రం వై విశ్వరూపిణం ధ్యాయేత్

తాత్పర్యము: శుద్ధ స్పటికమువలె ప్రకాశించు వానిగా, మూడు కన్నులు, ఐదు ముఖములు, పది భుజములు కలవానిగా, సర్వాభరణములతో అలంకరించబడిన వానిగా, నీలకంఠముతో, చంద్రుని ఖండపు గుర్తుతో, సర్పపు యజ్ఞోపవీతము, నాగాభరణములు, పులిచర్మపు ఉత్తరీయము, హస్తములందు కమండలము, జపమాల, అభయము, వరదానము తెలిపే హస్త ముద్రలు, హస్తమునందు శూలము కలిగి ప్రజ్వలించుచు కపిల వర్ణము (ఎరుపు పసిమి కలిసిన) కళ జడలును, పైకి ఎత్తి కట్ట బడిన శిఖ కలిగి,  నంది వృషభపు మూపును ఆరోహించి దేహార్ధమున ఉమను కలిగి అమృతముతో తడిసిన వానిగా హర్షము, దివ్యభోగములు కలిగి దిగ్దేవతలతో కూడి సురాసురుల నమస్కారములను అందుకొనువానిగా, నిత్యునిగా, శాశ్వతునిగా, శుద్దునిగా, సర్వవ్యాపియగు ఈశానునిగా సకల జగద్రూపునిగా రుద్రుని భావించి ధ్యానించాలి.

మాస శివరాత్రి ?
ఎందుకు జరుపుకోవాలి?
ఎలా జరుపుకోవాలి?
దాని వలన ఉపయోగములు

1. మాస శివరాత్రిని ఎప్పుడు జరుపుకోవాలి ?
ప్రతి నెల అమావాస్య ముందురోజు వచ్చే చతుర్ధశి తిధిని మాసశివరాత్రిగా జరుపుకుంటారు.
అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం (లింగోద్భవం) అని అర్ధం.
శివుని జన్మ తిధిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి.

2. మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి?
మహాశివుడు లయ కారకుడు. కనీనికా నాడీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారము లయానికి (మృత్యువునకు) కారకుడు కేతువు, అమావాస్య ముందు వచ్చే చతుర్ధసి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు.

చంద్రోమా మనస్సో జాతః

అనే సిద్దాంతము ప్రకారము ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడూ జీవులపై ఈ కేతు ప్రభావము ఉండటము వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావము చూయించడము వలన జీర్ణ శక్తి మందగిస్తుంది. తద్వారా మనస్సు ప్రభావితం అవుతుంది. తద్వారా ఆయా జీవులు ఈ సమయంలో మానసికముగా సమయమును కోల్పోవడమో, చంచల స్వభావులుగా మారడమో, మనోద్వేగముతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడమో జరిగి కొన్ని సమయాలలో తమకే కాకుండా తమ సమీపములో ఉన్న ప్రజల యొక్క మనస్సు, ఆరోగ్యం, ధనం, ప్రాణము లకు హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు.

అందుకే మనం గమనించవచ్చు .., అమావాస్య తిధి ముందు ఘడియాలలో కొందరి అనారోగ్యం మందగించండం లేదా తిరగబెట్టడం, ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించదానికి కారణము ఇదే అని చెప్పవచ్చు.
కావున ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా లేక వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా మనం అవకాశం ఉన్నంత మేర ప్రతి మాసము ఈ మాస శివరాత్రిని జరుపుకోవలసిన అవసరం ఉన్నది.

3. మాస శివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలి ?
ఈ అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసము ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానాధికాలు ముగించుకుని దగ్గరలోని శివాలయ దర్శనం చెయ్యాలి. అవకాశం ఉన్న వారు వారి శక్తి మేర 5/11/18/21/56/108 ఇలా ప్రదక్షణములు చేయవచ్చు. అలాగే ఈ రోజు శివాలయములో పూజలో ఉంచిన చెరకు రసమును భక్తులకు పంచినచో వృత్తి అంశములో ఇబ్బందులను ఎదుర్కొనేవారికి అటువంటి ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుంది.

అలాగే ఆరోజు ప్రదోష వేల శివునకు మారేడు దళములతో లేదా కనీసము గంగా జలముతో అభిషేకాది అర్చనలు చేయడము మంచిది. ఇవేమీ చేయడానికి అవకాశము లేని వారు, ఆరోగ్యవంతులు, అలాగే గృహములో అశుచి దోషము లేని వారు ఈ రోజు ఉపవాసము ఉండి, మూడు పూటలా చల్లటి నీటితో వీలు అయినంత ఎక్కువ సమయం స్నానం చెయ్యాలి. మంచం మీద కాకుండా నేలపై పవళించాలి.

4.మాస శివరాత్రిని జరుపుకోవడము వలన ఉపయోగములు ?
ప్రత్యేకించి ఈ రోజు ను సశాస్త్రీయంగా జరుపుకోవడము వలన వలన మన జాతకములోని క్షీణ చంద్ర దోషముల యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది.
సంతానలేమి సమస్యలు నుండి విముక్తి లభిస్తుంది.
వృత్తి అంశంలో ఉన్న ఆలశ్యాలు, అవరోధాలు అంశంలో మార్పు కల్గుతుంది.
దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
ముఖ్యంగా మొండిగా, పెంకిగా, బద్దకంగా, మూర్ఘంగా ప్రవర్తించే పిల్లల చేత వారి తల్లిదండ్రులు ఈ రోజు ఉపవాసమును చేయించి దేవాలమునకు వెళ్ళే అలవాటును చేయించగల్గితే వారిలో కాలక్రమము లో ఖశ్చ్హితముగా మార్పు వస్తుందని భావించవచ్చు.
మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
కావున మనం అందరం కూడా ఈ రోజు నుండి అవకాశం ఉన్నంత మేర ప్రతి మాస శివరాత్రిని సశాస్త్రీయంగా జరుపుకోవడము ద్వారా శుభములను పొందుదాం.

మహాశివుని తో పార్వతి కళ్యాణం.

పార్వతి, పరమేశ్వరుల వివాహం జరిగిన రోజు కూడ మహశివరాత్రి రోజే.

దక్షయజ్ఞనికి వచ్చి అక్కడ అవమానంతో సతీదేవి దేహత్యాగం చేసుకుంటూంది.. ఆ తరువాత శివుడు విరహభాధతో విరక్తి చేందినవాడై కైలాసగిరిలో తప్పస్సు లో లీనమైపోతాడు.. సతీ అంశ, పార్వతి రూపంలో పర్వతరాజుహిమవంతునికి కుమార్తేగ జన్మిస్తుంది.. ఆమే బాల్యం నుంచే శివుని భక్తురాలు. శివుని భర్తగా భావించి పూజిస్తుంది. శివుని ప్రేమతో గేలుచుకోలేమని, భక్తితో మాత్రమే పోందగలమని, తప్పస్సు చేయడానికి సిద్దపడుతుంది. పార్వతితప్పస్సు ఎలా చేస్తుందంటే... తప్పస్సే స్త్రీ రూపంలో మారిందా.. అన్నట్టుగా కఠోర తప్పస్సు చేసి, చివరికి తన భక్తితోశివుని పోందగలుగుతుంది. ఆదిశక్తి అంశ అయినసరే పార్వతి తన పుత్రిక ధర్మని అనుసరించి తల్లిదoడ్రుల సమ్మతితోశివుని వివాహమాడుతుంది...

శంకరుడు, చంద్రశేఖరునిగా మారిన కధ.

దక్ష ప్రజాపతికి ప్రసుతి ద్వార 24 మంది, పంచజని ద్వార 62 మంది కుమార్తేలు గలరు. అందులో 27 మందికుమార్తేలకు చంద్రునితో కళ్యాణం జరిగింది. వారు మనం నక్షత్రలుగా పిలుచుకుంటూన్న కృత్తిక, రోహిణి, మృగశిర,ఆరుద్ర, పూనర్వసు, పుష్య, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్తా, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ట, మూల,పుర్వషాడ, ఉత్తరషాడ, శ్రవణ, ధనిష్ట, శతభిష,,పూర్వభాధ్ర, ఉత్తరభాధ్ర, రేవతి, అశ్వని, భరణి..

27 మందిని పెళ్ళి చేసుకున్న చంద్రుడు,రోహినితో మత్రమే ప్రేమగా ఉండటంతో మిగిలిన 26 మందిభాదపడుతు ఉండేవారు. వీరి విచారనికి కారణం తేలుసుకున్న దక్షుడు కోపంతో చంద్రుని క్షిణించిపోమ్మని శపిస్తాడు.. చంద్రుడు, బ్రతికించమని దేవులందరిని వేడుకొనగా దీనికి శివుడే తగినవాడనడంతో భోలశంకరుని క్షమించమనిప్రార్ధిస్తాడు.. శివుడు చంద్రుని క్షమించి చంద్రుని తన శిరసున ధరిస్తాడు. శివుని వద్ద ఉండటంతో చంద్రునికి ప్రాణహనిలేకపోయినప్పటికిని.. దక్షుని శపం వలన క్షిణించే గుణం తప్పదని, చంద్రుడు పక్షం రోజులు ప్రకాశించడం (కృష్ణ పక్షం) తరువత పక్షం రోజులు క్షిణించడం (శుక్ల పక్షం) ఇలా సృష్టి ఉన్నంత వరకు జరుగుతుందని శివుడు తేలియజేస్తాడు.

చంద్రుని శిరసున ధరించి పరమేశ్వరుడు చంద్రశేఖరుడైనడు. ఆ రోజే సోమనాధ్ క్షేత్రం వేలసింది. అది మఘమాస, కృష్ణపక్షం లోని చతుర్ధశి.. మనం జరుపుకుంటున్న మహాశివరాత్రి..

పరమేశ్వరుడు జపించే శ్రీరామ మంత్రo

పరమేశ్వరుడు, ముక్కంటి అయిన శివుడే విష్ణు స్తోత్రమునకు శ్రీరామ మంత్రాన్ని జపించినట్లు శాస్త్రాలు చెబుతున్నారు. దుష్టశిక్షణ శిష్టరక్షణార్ధమై చైత్రశుద్ద దశమినాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం 'శ్రీరామనవమి' గా విశేషంగా జరుపుకుంటాం.

'రామ' యనగా రమించుట అని అర్ధం. కావున మనము ఎల్లప్పుడు మన హృదయకమలమందు వెలుగొందుచున్న 'ఆ శ్రీరాముని' కనుగొంటూ వుండాలని పండితులు అంటున్నారు.

ఒకసారి పార్వతీదేవి పరమశివుని 'కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం' అని, విష్ణు సహస్రనామ స్తోత్రంనకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది. దానికి పరమేశ్వరుడు, "ఓ పార్వతీ! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా!" అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసనచేస్తాడు.

శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తవశంకరుడే ఈతారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి వార్కి సధ్గతి కలిగిస్తారన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం.

శ్రీరామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు 'రా' అనగానే మన నోరు తెరచుకుని మనలోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయని విశ్వాసం. అలాగనే 'మ' అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు మననోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట. అందుచేత శ్రీరామనవమి నాడు శ్రీరాముని అనుగ్రహం పొందాలంటే ఈ ఒక్క మంత్రముతో జపిస్తే చాలునని పండితులు అంటున్నారు.

పరమేశ్వరుడు

ఆదిదేవుడిగా, సర్వజ్ఞుడిగా, భోళాశంకరుడిగా, పరమశివునిగా కీర్తించబడే పరమాత్మయే పరమేశ్వరుడు.

ఈయన హిందువులకు అత్యంత ఆరాధనీయ దైవం. లింగ స్వరూపంలో పూజలందుకునే ఈ పరమశివుడే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములను నిర్వహిస్తూ భక్తుల పాలిట కల్పవృక్షంగా భాసిస్తూ ఉంటాడు.

జగన్మాత అయిన పార్వతీదేవి ఈయన అర్ధాంగి. పార్వతీపరమేశ్వరులు ఆదిదంపతులుగా సకలలోకవాసులచేత పూజలందుకుంటూ ఉంటారు. శివ కుటుంబం కూడా చాలా చిత్రమైనది.

శివుడు త్రినేత్రుడై, భస్మాంగధారియై, పాములను ఆభరణాలుగా వేసుకుని, గజచర్మాన్ని ధరించి ఉంటే, అమ్మవారు సకలాభరణ భూషితురాలై అలరారుతూ ఉంటుంది.

పెద్దకుమారుడైన విఘ్నేశ్వరుడు గజముఖుడు. చిన్నకుమారుడైన కుమారస్వామి ఆరు ముఖములు కలవాడు.

విరోధ భావన కలిగిన జీవులైన ఎద్దు, సింహం, ఎలుక, నెమలి, పాము, శివ సదనమైన కైలాసగిరిపై సఖ్యతతో తిరుగాడుతూ ఉంటాయి.

పరమేశ్వరుడిని నిరంతరారాధన చేసేవారి హృదయమే కైలాసమై, వారి మనసులోని కామక్రోధాదులు శమించి నిరంతరానందాన్ని పొందుతారన్న సత్యాన్ని పైవిషయం ప్రబోధిస్తుంది.

నిర్గుణ పరబ్రహ్మ యొక్క కర్మ స్వరూపం శ్రీమహావిష్ణువు అయితే, జ్ఞాన స్వరూపం పరమేశ్వరుడు.

అందుకే లౌకిక పురోగతికి విష్ణు రూపాన్ని, ఆధ్యాత్మిక పురోగతికి శివ స్వరూపాన్ని ఆరాధన చేయాలని పురాణాలు చెబుతున్నాయి.

వేదం శివుడిని సకల దుఃఖ హరుడైన రుద్రుడిగా చెబుతోంది. శత్రుబాధ, పిశాచపీడ, దుఃఖము పోవడానికి ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని,

విషపూరిత జీవుల నుండి రక్షణకై ఓం నమో భగవతే నీలకంఠాయ అనే మంత్రాన్ని పఠించాలన్నది పురాణవచనం.

మంత్రములలోకెల్లా గొప్పదిగా చెప్పబడే పంచాక్షరి మహామంత్రమునందు పరమేశ్వర శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఆ మంత్రరాజమే... నమఃశివాయ.