అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రకృతి లో ఉండే భీబత్సవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన లన నుండి భయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టనో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము--అష్టదిక్పాలకులు .. వారి సతీమణులు -- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకుందాం . --

అష్టదిక్పాలుకుడు అష్టదిక్పాలుకుడి భార్య అష్టదిక్పాలుకుడి ఆయుధం అష్టదిక్పాలుకుడి దిక్కు అష్టదిక్పాలుకుడి లొకము అష్టదిక్పాలుకుడి వాహనం
ఇంద్రుడు శచీదేవి వజ్రాయుధం తూర్పు అమరావతి ఐరావతం
అగ్నిదేవుడు స్వాహాదేవి శక్తి ఆగ్నేయము తేజోవతి మేక
యముడు శ్యామలాదేవి దండం దక్షిణ దిక్కు సంయమని మహిషం
నిర్భతి దీర్ఘదేవి కుంతం నైఋతి కృష్ణాంగన గుర్రం, ప్రేతం
వరుణుడు కాళికాదేవి పాశం పడమర శ్రద్ధావతి మొసలి
వాయుదేవుడు అంజనాదేవి ధ్వజం వాయువ్య దిక్కు గంధవతి లేడి
కుబేరుడు చిత్రరేఖనాదేవి ఖడ్గం ఉత్తరదిక్కు అలకాపురి పుష్పకవిమానం
ఈశానుడు (ఈశ్వరుడు) పార్వతీదేవి త్రిశూలం ఈశాన్య దిక్కు యశోవతి వృషభం

చతుర్ధశలోకములు -

ఇతిహాస, పురాణములననుసరించి, బ్రహ్మదేవుని సృష్టిలోన చతుర్ధశ (14) భువనములు లేక లోకములు కలవు. మనమున్న భూలోకమునకు పైన భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము మరియు సత్యలోకములు, భూలోకముతో చేర్చి సప్త (7) లోకములు కలవు. అలాగే భూలోకమునకు క్రింద అతలలోకము, వితలలోకము, సుతలలోకము, రసాతలలోకము, తలాతలలోకము, మహాతలలోకము, పాతాళములని సప్త (7) అధోలోకములు కలవు.

భూలోకవాసులైన మానవులను తప్పించి ఇతర లోకములలోనున్నవారు అధిక పుణ్యాత్ములు, అచ్చటనున్న జీవుల శరీరములు అతిసూక్ష్మములైనవి. భూలోకము యొక్క దక్షిణదిగ్భాగములో మృత్యు (యమ) లోకము, ప్రేతలోకము, నరకలోకము, పిత్రులోకములనే 4 భాగములు కలవు.

(1) భూలోకము - ఇచ్చట స్వేదము (చెమట నుండి ఉద్భవించు పేళ్ళు (పేనులు), నల్లులు మొ.), ఉద్భిజములు (గ్రుడ్డు నుండి ఉద్భవించు పక్షులు), జరాయుజములు (స్త్రీ, పశువుల గర్భము నుంది ఉద్భవించు మానవులు మరియు పశువులు) అని నాలుగు విధములైన జీవరాసులు.

(2) భువర్లోకము (భూలోకము పైన) - ఇచ్చట సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాదులు, అశ్విన్యాది నక్షత్ర సద్రుష్యములైన గ్రహరాసులు, సూక్ష్మ శరీరులైన కిన్నెరా, కింపురుష, విద్యాధరులు కలరు.

(3) సువఃలోకము లేక సువర్లోకము లేక స్వర్గలోకము (భువర్లోకము పైన) - ఇక్కడ అధిష్ఠాన దేవతలు అగు ఇంద్రాదులు, దిక్పాలకులు, వర్ష-వాయువులు, ఐశ్వర్యాదులు కలరు. వీరితోపాటు సాధ్యులు, మహర్షులు, గంధర్వులు, అప్సరసలు కలరు. వీరు కామరూపులై భోగములనుభవింతురు. వీరికి వ్రుద్ధ్యాము, శరీర దుర్గందాధులుండవు. వీరిని క్షుత్పిసలు బాధింపవు. వీరు అయోనిజులు కావున, మాత్రు-గర్భ వాసము లేదు.

(4) మహర్లోకము (సువర్లోకము పైన) = ఇక్కడ దేవతలు తపమొనరించు చుందురు. ఎలా స్వర్గలోకములోని దేవతలు దివ్య సుఖమును అనుభవించుచున్నారో, అవియన్నియూ ఇక్కడ తపస్సు ద్వారా పరుపూర్ణముగా అనుభవించుచున్నారు.

(5) జనోలోకము (మహర్లోకము పైన) - దీనిని కొందరు సత్యలోకమని కూడా అందురు. ఏ స్త్రీ భర్త మరణానంతరము సహగమనము చేయునో, ఆమె యొక్క పవిత్ర శీలప్రభావముచేత ఆమె పతికి అన్య జన్మ ఉన్నప్పిటికినీ, జన్మరాహిత్యము కలిగి, సతిపతులిరువును ఈ జనలోకములో సుఖసాంతులతో వర్ధిల్లుదురు. ఇచ్చట అయోనిజ దేవతలు కూడా తపమాచరించుదురు.

(6) తపోలోకము (జనోలోకము పైన) - ఇక్కడ అయోనిజ దేవతలు నివసించుచుందురు. పంచభూతములు, పంచేంద్రియములు వీరి ఆధీనములో ఉండును. కైలాసము, వైకుంఠము, మణిద్వీపము, స్కంధలోకము ఇచ్చటనే కలవు. ఈ లోకము సర్వదా సుగంధ ద్రవ్యముల సువాసనలతోను, శాంతియుతముగాను, సాంద్రానందముతోను కూడియుండును. భూలోకములో ఎవరెవరు, ఏయే దేవతాముర్తులను ఉపాసించిరో ఆయా మూర్తుల రూపములతో ఇచ్చట తపములాచరించుచున్నారు. ఈ రీతిగా వారు కల్పాంత-కాలము అచ్చటనే ఉంది కర్మానుసారము భూలోకములో మరల జన్మించి, మరల పవిత్ర తపములు ఆచరించి, ఎప్పుడు మహాప్రళయములో సర్వమూ లయమగునో అప్పుడు వీరుకూడ జన్మరాహిత్యము పొందుదురు.

(7) సత్యలోకము (తపోలోకము పైన) - ఇచ్చటనే సృష్టికర్త అయిన హిరణ్యగర్భుడు, బ్రహ్మయను ఒక అధికారిక పురుషుడు ఆ పదవిని అనేకానేక కల్పానంతరము ఒక్కక్కరు పొంది తమ ఆయువు తీరినంతనే బ్రహ్మములో లయమగుదురు. ప్రస్తుత బ్రహ్మకు మొదటి అర్థభాగము తీరినది. భావిబ్రహ్మ శ్రీ ఆంజనేయస్వామి. ఈ లోకములోకూడ అనేక ఉపాసనలు చేసినవారు, వేదాంత విచారకులు, భూలోకములో ఆత్మజ్ఞానము పొందినవారు, అసంఖ్యాకులగు మహర్షులు వేదాంతవిచారణలు గావించుచుందురు. మహాప్రళయకాలములో బ్రహ్మలోక పర్యంతముగాగల సప్తలోకములు పరబ్రహ్మములో లయమగును. బ్రహ్మయొక్క ప్రతి రాత్రులందు ఒక్కొక్క ప్రళయము సంభవించి, భూలోకము, భువర్లోకము, సువ(స్వర్గ)ర్లోకములు లయమును పొందును. అతని యొక్క పగటి కాలమందు పునః ఈ లోకములు సృష్టింపబడును.

సప్త అధోలోకములు:

(1) భూలోకమునకు క్రింద అతల లోకము కలదు. ఇందులో అసురులు నివసించుచుందురు. వీరు సూక్ష్మ శరీరులు. భౌతిక సుఖలాలసులు కావున అధిక మద సంపన్నులు.

(2) వితల లోకము (అతలలోకము క్రింద) - ఇచ్చట పార్వతీ-పరమేశ్వరుల వీర్యము "ఆఢకము" అనే నది సువర్ణ జల ప్రవాహములతో నిండి యుండును. అనేక భౌతిక సుఖములతోపాటు ఈ నదీ ప్రవాహమాలతో సుర్వర్ణాభరణములు చేసుకొని ధరించెదరు.

(3) సుతల లోకము (వితల లోకము క్రింద) - సప్త చిరంజీవులలో ఒకడైన మహాపురుషుడు బలి చక్రవర్తి ఇచటనే కలడు. అయన సర్వదా విష్ణుధ్యాన పరాయణుడై, శ్రీమహావిష్ణువు ద్వారపాలకుడై కాపలాకాయుచుండగా ఉన్నాడు.

(4) తలాతల లోకము (సుతల లోకము క్రింద) - ఈ లోకములో పరమేశ్వరునిచేత సంహరించబడిన దానవేంద్రులయిన త్రిపురాసురులు, దానవ శిల్పి యగు మయుడు, మాయావిద్యయందు నేర్పరులైన అసురులు, రాక్షసులు నివసించెదరు.

(5) మహాతలము (తలాతలలోకము క్రింద) - ఇచ్చట కద్రుపుత్రులైన కాద్రవేయులు (సర్పములు), సహస్రాది శరుస్సులతో కూడినవారై మహా బలవంతులై కామరూపధారులై తమ పత్నులతో కూడి ఉన్నారు.

(6) రసాతలము (మహాతలము క్రింద) - ఇచ్చట అసుర రాక్షసశ్రేష్ఠులు, నివాత కావచులు, కాలకేయాదులు, సురారులైన అనేక రాక్షసులు కలరు.

(7) పాతాళము (రసాతలము క్రింద) - ఇచ్చటనే నాగలోకాధిపతియైన వాసుకి మొదలు సర్ప సమూహములన్నియు కామరూపధారులై సుఖసంతోషములతో ఉన్నారు.

మహా ప్రళయ కాలములో ఈ చతుర్ధశభువనములు పరబ్రహ్మములో లీనమగును.

అష్టదిక్పాలకులు - వారి ప్రాధాన్యత

ప్రతి ఇంటికి ఎనిమిది దిక్కులు ఉంటాయి. ఒక్కో దిగ్గుక్కును ఒక్కో దేవత పరిపాలిస్తుంటారు. ఆ ప్రకారం తూర్పు దిక్కుకు అధిష్టాన దేవత ఇంద్రుడు. ఈయన సంతానం, ఐశ్వర్యాలను కలిగిస్తాడు కనుక ఈ భాగంలో ఎక్కువ బరువు పెట్టడం మంచిది కాదు. ఈ దిక్కులో బావులు, బోర్లు నిర్మించటం వల్ల శుభం చేకూరుతుంది.

పడమర దిక్కునకు అధిష్టాన దేవత వరుణ దేవుడు. తూర్పు దిక్కుకన్నా తక్కువ ఖాళీ స్థలం విడిచిపెట్టి ఎత్తుగా ఉండే విధంగా చూసుకున్నట్లయితే సర్వశుభములు కలుగుతాయి. పడమర భాగంలో మంచి నీటి బావులు, బోరులు నిర్మించుకోవచ్చు. అయితే ఇవి విదిశలకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇక ఉత్తర దిక్కుకు అధిష్టాన దేవత కుబేరుడు. దక్షిణ దిక్కుకంటే పల్లంగానూ విశాలంగానూ ఈ దిశ ఉండాలా చూసుకోవాలి. ఈ దిక్కులో బోరులు, బావులు ఏర్పాటు చేసుకోవటం మంచిదే. దీనివల్ల విద్య, ఆదాయం, సంతానం, పలుకుబడి పెరుగే అవకాశం ఉంది.

అలాగే దక్షిణం దిశకు అధిష్టాన దేవత యముడు. ఉత్తరదిశ ఖాళీ స్థలం కన్నా ఈ దిశలో తక్కువ ఖాళీ స్థలం ఉండేటట్లు చూసుకోవడం ఉత్తమం. దీనివల్ల సంతానం, ఆదాయం అభివృద్ధి చెందుతుంది. దీనికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే స్థిరాస్తుల అమ్మకం, అనారోగ్యాలు బారిన పడక తప్పదు.

ఈశాన్య దిక్కకు అధిదేవత ఈశ్వరుడు. అన్ని దిక్కుల కన్నా ఈ దిశ విశాలంగా, పల్లంగానూ ఉండాలి. ఈశ్వరుడు గంగాధరుడు కనుక ఈ దిశలో నీరు... బావి ఉండటం వల్ల అష్టైశ్వర్యములు కలుగుతాయి. అంతేగాక భక్తి జ్ఞానములు ఉన్నత ఉద్యోగాలు సమకూరతాయని వాస్తు శాస్త్రం తెలియజేస్తోంది.

ఆగ్నేయానికి అధిష్టాన దేవత అగ్నిదేవుడు. అందువల్ల ఈ దిక్కున వంట ఏర్పాటు చేసుకోవటం శుభం. బావులు, గోతులు... ఇతర దిశలకన్నా ఎక్కువ పల్లంగా ఉంచటం ఎంత మాత్రం మంచిదికాదు. దీనివల్ల వ్యసనాలు, ప్రమాదాలు, అనారోగ్యాలు స్థిరాస్థులు కోల్పోవటం జరుగుతుంది.

వాయవ్యానికి అధిష్టాన దేవత వాయువు. నైరుతి,ఆగ్నేయ దిశలకన్నా పల్లంగానూ, ఈశాన్య దిక్కుకన్నా మిర్రుగానూ ఉండాలి. అదే విధంగా ఈ దిశలో నూతులు,గోతులు ఉండకుండా చూసుకోవాలి. ఈ దిశ ఈశాన్యం కన్నా హెచ్చుగా పెరిగి ఉండకూడదు. ఇలా ఉండటం వల్ల పుత్ర సంతతికి హాని, అభివృద్ధికి అవరోధం కలిగే అవకాశం ఉంది.

నైరుతి దిక్కుకు అధిష్టాన దేవత నివృత్తి అనే రాక్షసుడు. అన్న దిక్కులకన్నా ఈ దిశ తక్కువ ఖాళీగా ఉండి ఎక్కువ ఎత్తు కలిగి ఉండాలి. ఈ దిశలో ఎక్కువగా బరువులు వేయటం శుభం. ఈ దిశలో గోతులు, నూతులు ఉన్నట్లైతే ప్రమాదాలు, దీర్ఘ వ్యాధులు, స్థిరాస్తులు కోల్పోవటం జరుగుతుంది.